Raadha (రాధ )

 ఎప్పటి లాగే ఆ రోజు, రఘు తెల్లవారే నిద్ర లేచి తన స్నేహితులతో వ్యాయామం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న పరంధామయ్య గారు, రారా రఘు నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వలా వ్యాయామం చెయ్యడానికి వెళ్ళావో లేదో ఒక అమ్మాయి  నీ కోసం మన ఇంటికి వచ్చింది. తన పేరు రాధ అని చెప్పింది. ఆ పేరు వినటం తోనే ఒక్కసారిగా రఘు మొహం అంత చెమటలతో నిండి పోయింది. రాధ ఎక్కడ ఉంది నాన్నా అని అడిగిన  తన కొడుకు  గొంతు లో ఏదో తెలియని తడబాటు పరంధామయ్య గారు గ్రహించలేక పోలేదు. 

అదిగో అక్కడ వరండా లో కూర్చుని ఉంది అన్న పరంధామయ్య మాటలతో, రఘు చూపు ఒక్కసారిగా వరండా లో ఉన్న రాధ వైపు మల్లింది. రాధ, రెండు చిన్న జడలతో, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని అచ్చం అమ్మవారి లాగా ఉంది (అప్పటికి రాధ వయసు ఇంచుమించుగా పది సంవత్సరాలు ఉంటుంది).  రఘుని చూడగానే, రాధ కళ్ళలో ఒక రకమైన ఆనందం, వెంటనే రఘు వద్దకి వెళ్లి అయ్యగారు అని ఏడవటం మొదలు పెట్టింది.  రాధ ఏడవటం తో కంగుతున్న రఘు, ఏమైంది రాధ, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరన్నా ఎమన్నా అన్నారా, అయినా ఒక్క దానివే ఇక్కడికి ఎలా వచ్చావు, ఏడవకమ్మా, నేను ఉన్నాను కదా. ముందు వచ్చి ఇలా కూర్చో. 

బయట జరుగుతున్న ఈ మాటలు వినపడి, వంట గదిలో ఉన్న జానకి (రఘు భార్య) బయటకు వచ్చింది. రాధ ఏడవటం చూసి, ఎవరండీ ఈ అమ్మాయి, ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంది. అక్కడే ఉన్న పరంధామయ్య, నేను ఇందాకటి నుంచి ఎవరమ్మా అని అడుగుతుంటె, మౌనం గా ఉందమ్మా, కానీ రఘు ని చూడగానే ఒక్కసారిగా ఏడవటం మొదలు పెట్టింది అని అంటారు. ఏరా రఘు, ఇంత జరుగుతున్నా మాట్లాడవేరా, అసలు ఎవరు ఈ అమ్మాయి అని నిలదీస్తాడు.

రఘు: నాన్న ఈ అమ్మాయి పేరు రాధ, నేను కాకినాడ లో నేను టీచర్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, మా హాస్టల్ లో పనిచేసే రంగన్న మనమరాలు. రంగన్న కి రాధ తప్ప ఎవరూ లేరు, నేను అప్పుడప్పుడు కాస్త డబ్బు సాయం చేసేవాడిని. రాధ ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎందుకు ఏడుస్తుందో నాకేమి అర్ధం కావటం లేదు నాన్నా, జానకి ముందు రాధని ఇంట్లోకి తీసుకువెళ్లి కాస్త మంచి నీరు ఇవ్వు. తన కుదురుకున్నాక అసలు ఏమి జరిగిందో నెమ్మది గా అడిగి తెలుసుకుందాం.

జానకి: అలాగే అండి, రాధ ఇలా రా అమ్మ, ముందు కాస్త ఎంగిలి పడు, ఎప్పుడు తిన్నావో  ఏమో అని లోపలకి తీసుకువెళ్తుంది. 

సమయం సాయంత్రం ఏడు గంటలు అవుతుంది. పరంధామయ్య గారి ఇంట్లో పెందరాడే భోజనం చేసే అలవాటు ఉంది. జానకి భోజనం సిద్ధం చేసి అందరినీ పిలుస్తుంది. పరంధామయ్య భోజనం చేసే గదికి వచ్చి కూర్చుంటారు. ఎంతసేపటికీ రఘు, మరియు  రాధ రాకపోవటంతో, పరంధామయ్య, జానకి తో అమ్మా జానకి రఘు ఇంట్లో లేడా అని అడుగుతాడు.

జానకి: ఉన్నారు మామయ్య గారు, మధ్యాహ్నం కూడా ఆయన భోజనం చెయ్యలేదు, ఏదో పరధ్యానం లో ఉన్నారు.

పరంధామయ్య : మరి ఆ అమ్మాయి రాధ భోజనం చేసిందా.

జానకి: ఉదయం కాస్త ఎంగిలి పడింది మామయ్య, కానీ ఏడుస్తూనే ఉంది అని చెప్తుంది.

పరంధామయ్య: ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు ఏడుస్తుందో విషయం ఎమన్నా కనుక్కున్నవా జానకి

జానకి: మీ అబ్బాయి గారిని అడగటానికి ప్రయత్నించాను మామయ్య గారు, కానీ ఆయన నుంచి ఎటువంటి జవాబు రాలేదు.

పరంధామయ్య: మరి రాధను అడగలేక పోయావా.

జానకి: అడిగి చూసాను మామయ్య, కానీ తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు.  సరే కాస్త కుదుట పడ్డాక అడుగుదాం అని అనుకుంటున్నాను.  

పరంధామయ్య: సరే నేను వెళ్లి రఘు ని తీసుకువస్తాను, నువ్వు వెళ్లి రాధని భోజనానికి తీసుకునిరా, భోజనం చేసాక నెమ్మదిగా అడిగి తెలుసుకుందాం.

అందరూ భోజనం చేసారు. జానకి వంట గదిలో పాత్రలు కడుగుతూ ఉంటుంది. పరంధామయ్య, రఘు వద్దకు వెళ్లి, రఘు రాధ ఎందుకు వచ్చిందో  అడిగి చూశావా అని అడుగుతారు.

రఘు: ఇంకా లేదు నాన్న 

పరంధామయ్య: అసలే ఆడబిడ్డ, ఎంత కష్టం వచ్చిందో ఏమో, వెళ్లి నెమ్మదిగా అడిగి తెలుసుకో రఘు.

రఘు: పరధ్యానం లో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.

పరంధామయ్య: కొంచెం గొంతు పెంచి, రఘు నేను చెప్పింది విన్నావా, వెళ్లి రాధ తో మాట్లాడు అని అంటారు.

రాధ భోజనం చేసి తన గదిలో ఒక్కటే తన అమ్మ మరియు తాతతో దిగిన ఫోటో చూస్తూ ఉంటుంది.

రఘు: గది బయట నుంచి, లోపలకు రావచ్చా రాధ అని అడుగుతాడు. 

రాధ: రఘు మాటలను విన్న రాధ, పైకి లేచి నుంచుంటుంది.

రఘు: కూర్చో అమ్మ. ఉదయం నుంచి నీతో మాట్లాడదాం అని అనుకుంటున్నాను. అసలు ఏమి జరిగింది.

(రాధ కనుల వెంట నీరు.... )

రాధ: బొంగురు పోయిన గొంతుతో, తాత చనిపోయారు అయ్యగారు. చనిపోయేముందు  నన్ను మీ  వద్ద కు వెళ్లామన్నారు అని, తన తాత ఇచ్చిన ఉత్తరాన్ని తీసి రఘు చేతిలో పెడుతుంది.

ఆ ఉత్తరాన్ని చదివిన రఘు పచ్చాత్తాపం తో బయటకు వస్తాడు. అప్పటికే పరంధామయ్య మరియు జానకి రఘు కోసం బయట ఎదురు చూస్తూ ఉంటారు.

పరంధామయ్య: రాధ ఎమన్నా చెప్పిందా రఘు అని అడుగుతారు.

రఘు: రాధ వాళ్ళ తాత గారు చనిపోయారు నాన్న. తనకు ఎవరూ లేరు, రంగన్న చనిపోయే చివరి క్షణాలలో తనని నా వద్దకి వెళ్ళమని చెప్పాడు. రంగన్న చాలా మంచి వాడు, ఇలా జరిగి ఉండాల్సింది కాదు అంటాడు.

జానకి: అయ్యో రాధకి ఎంత కష్టం వచ్చింది.

పరంధామయ్య: రాధకి కావాల్సిన వాళ్ళు కానీ, బంధువులు కానీ  లేరా....

రఘు: ఉన్నారు నాన్న గారు, కానీ ఆడపిల్ల అనే సరికి, ఎవరికీ వారు వాళ్ళ స్వార్ధం చూసుకొని తనని వదిలేశారు.

పరంధామయ్య: మరి ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు.

రఘు: అదే ఆలోచిస్తున్నాను....

రఘు మొహం లో, ఇంతకు ముందెన్నడూ ఇలా బాధ, పచ్చాత్తాపం జానకి చూడనే లేదు.  

జానకి:  తన భర్త ఇబ్బంది ని గ్రహించిన జానకి, ఇందులో ఆలోచించేది ఏమి ఉంది మామయ్య గారు, అసలే ఆడపిల్ల, అందులోనూ పుట్టెడు బాధ లో ఉంది. చూస్తూ చూస్తూ ఆలా వదిలెయ్యలేం కదా, తను కూడా మనతోనే ఇక్కడే ఉంటుంది అని అంటుంది.

రఘు: జానకి నుంచి ఈ మాట రావటం తో, రఘు మొహం కాస్త కుదుట పడినట్లుగా ఉంటుంది.

జానకి: మీరు ఏమి అంటారు మామయ్య గారు. 

పరంధామయ్య: మీ ఇద్దరికీ లేని అభ్యంతరం, నాకు మాత్రం ఎందుకు ఉంటుంది అమ్మా, అలాగే కానివ్వండి.

(ఇంకా ఉంది......................)


Comments